ఖమ్మం టౌన్, వెలుగు : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన గ్రీటింగ్ కార్డ్స్ పై ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ 'బి' విద్యార్థులు తమ సృజనాత్మక ప్రతిభను చాటుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించిన కొటేషన్స్ పొందుపరుస్తూ, స్వయంగా తయారు చేసిన అందమైన గ్రీటింగ్ కార్డులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దంపతులకు, అడిషనల్ కలెక్టర్ శ్రీ పి.శ్రీనివాస రెడ్డికి, జిల్లా అధికారులు గుడికందుల జ్యోతి, నారీ విజయలక్ష్మి, టీఎన్జీవోస్ అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్ కు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్యార్థులు ఎంతో శ్రద్ధతో, కృషితో రూపొందించిన ఈ గ్రీటింగ్ కార్డులు వారిలోని ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబించాయని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులను అభినందిస్తూ, భవిష్యత్లో మరింత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. జిల్లాలో హాస్టల్ సంక్షేమ అధికారులు, సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు హర్షనీయమని అధికారులు ప్రశంసించారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుడికందుల జ్యోతి, వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు, సూపరింటెండెంట్స్ రహీముద్దీన్, వెక్కిరాల శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్, ఆఫీస్ సిబ్బంది అస్లాం ఖాన్, శంకర్, రాకేశ్, నెల్లూరి నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, తిరుపతిరావు, నరేందర్, రమేశ్, హనుమంతరావు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
